Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు రంగం సిద్ధం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి పూర్తి ప్రణాళికను టీపీసీసీ ప్రకటించింది. పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఈ నెల 31వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

ప్రతి నియోజకవర్గంలోని ఒక ముఖ్య కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుండి సుమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో శ్రమదానం చేపట్టి, అనంతరం ఆ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజున మరో నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది.

ఈ మొదటి విడతలో ఆరు జిల్లాల్లో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు టీపీసీసీ వెల్లడించింది. కోఆర్డినేటర్లుగా ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కేతూరి వెంకటేష్, జూలురు ధనలక్ష్మి, పులి అనిల్ కుమార్‌లను నియమించారు.

మొదటి విడతలో పరిగి (రంగారెడ్డి), ఆందోల్ (మెదక్), ఆర్మూర్ (నిజామాబాద్), ఖానాపూర్ (ఆదిలాబాద్), చొప్పదండి (కరీంనగర్), వర్థన్నపేట (వరంగల్) నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

Leave a Reply