మందుబాబులకు శుభవార్త, బీసీలకు 42% రిజర్వేషన్: క్యాబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ మందుబాబులకు ప్రభుత్వం ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర క్యాబినెట్ మైక్రో బ్రూవరీల ఏర్పాటు విషయమై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఇన్‌స్టంట్ బీర్‌ అందించే మినీ బ్రూవరీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నగర ప్రాంతాల్లో ప్రతి 5 కిలోమీటర్లకో ఒక బ్రూవరీ ఏర్పాటుచేయాలని, పట్టణాల్లో మాత్రం 30 కిలోమీటర్లకు ఒక్కటి ఉండేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపుల లైసెన్సుల కోసం నోటిఫికేషన్లు త్వరలో విడుదలయ్యే అవకాశముంది.

42% బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ క్యాబినెట్‌ మంజూరు

ఇక రాజకీయంగా కూడా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయానికి మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం, దానిని కేంద్రానికి పంపించింది. అయితే గవర్నర్‌ ఇంకా ఆర్డినెన్స్‌కి ఆమోదం ఇవ్వకపోవడంతో, ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మరోపక్క వ్యూహం రూపొందించారు.

ఢిల్లీకి సీఎంతో పాటు మంత్రుల బృందం

బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ ఆగస్టు 5న ఢిల్లీలో పెద్ద స్థాయిలో ధర్నా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి మద్దతును కూడా కోరే అవకాశముంది.

Leave a Reply