Telangana BJP: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీల రహస్య భేటీ.. పార్టీలో విభేదాలేనా?

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాల కోసం వెళ్లిన తెలంగాణ బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు ఒకే చోట సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గైర్హాజరుకావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్ హాజరయ్యారు. ఇందులో ధర్మపురి అర్వింద్ మినహా మిగతా నేతలంతా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చినవారే కావడం విశేషం. అంతేకాకుండా వీరిలో చాలామంది రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించిన వారే కావడం మరింత రాజకీయ ఊహాగానాలకు దారి తీస్తోంది.

ఇక తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల పంపిణీ, పార్టీలో ప్రాధాన్యత వంటి అంశాలపై ఈ వివాదం బహిరంగంగా బయటపడింది. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజూరాబాద్‌లో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఈటల అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడం, అలాగే “వ్యక్తి పూజలు చేసే వారికి టికెట్లు ఇవ్వం” అని సంజయ్ వ్యాఖ్యానించడం ఈటల వర్గానికి అభ్యంతరకరంగా మారింది.

దీని ప్రతిస్పందనగా ఈటల తన అనుచరులతో సమావేశమై, స్థానిక ఎన్నికల్లో తమ వర్గానికి టికెట్లు ఇవ్వకపోతే హుజూరాబాద్‌లో ప్రతి ఊరిలో తమకంటూ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటారని హెచ్చరించారు. అంతేకాకుండా, హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కొందరు పార్టీ నేతల వ్యవహారశైలి కూడా కారణమని బండి సంజయ్ ఆరోపించడంపై ఈటల తీవ్రంగా స్పందించారు. “నా చరిత్ర తెలీదు కొడకా.. నీతిగల వారితో ధైర్యంగా పోరాడతాను గానీ కుట్రగాళ్లతో కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ అంతర్గత గొడవలు పార్టీ హైకమాండ్ దృష్టికి చేరాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు రాంచందర్‌రావు చేపట్టిన తర్వాత కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరైన మీటింగులకు మిగతా ఎంపీలు గైర్హాజరు కావడం కూడా బీజేపీ లోపల విభేదాలు ముదురుతున్నాయన్న చర్చలకు కారణమైంది.

Leave a Reply