దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలను వెల్లడించారు. “ఫస్ట్ డే.. ఫస్ట్ షో” నుంచి సినిమాలను రికార్డు చేస్తూ దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లలో ముఠా సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ETV Win కంటెంట్‌ను కూడా పైరసీ చేసి విక్రయించిన హర్షవర్ధన్ అనే నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు.

రికార్డు చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు విక్రయిస్తూ ఈ ముఠా లాభాలు పొందుతుందని తెలిపారు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్‌ను iBomma, Bappam TV సహా పలు ప్లాట్‌ఫామ్‌లకు విక్రయిస్తున్నారని గుర్తించామని చెప్పారు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ID, పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసి కాపీ చేస్తున్నట్లు కూడా నిర్ధారణ అయ్యిందన్నారు.

నేరగాళ్లు ఏజెంట్లను అడ్డం పెట్టుకుని కంటెంట్‌ను రికార్డ్ చేయిస్తారని, కొత్త సినిమా విడుదలైన రోజే హై రిజల్యూషన్ కెమెరాలతో టికెట్లు బుక్ చేసి రహస్యంగా ఫుటేజీ రికార్డు చేయిస్తున్నారని తెలిపారు. థియేటర్లలో ఎలా రహస్యంగా షూట్ చేయాలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ ముఠా కార్యకలాపాల వలన గతేడాది తెలుగు సినిమా ఇండస్ట్రీకి రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని సీపీ తెలిపారు. ఒక నిందితుడికి బెట్టింగ్ యాప్ ద్వారా నెలకు రూ.9 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లు బయటపడిందన్నారు. క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బు లావాదేవీలు జరపడం వలన కేసులో కీలకమైన క్లూలు లభించాయని తెలిపారు.

అంతేకాదు, ఈ ముఠా సభ్యులు డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేయగల నైపుణ్యం సంపాదించారని, కొన్నిసార్లు ప్రభుత్వ వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశారని వెల్లడించారు. ఇంతేకాదు, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా వదల్లేదని సీపీ CV ఆనంద్ అన్నారు.

 
			 
			 
			