KTR: తెలంగాణలో నెలరోజుల్లో 28 హత్యలు.. శాంతిభద్రతలపై కేటీఆర్‌ సంచలన ఫోస్ట్

తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం, కేవలం ఒక నెల వ్యవధిలోనే రాష్ట్రంలో 28 హత్యలు జరిగాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఇటీవల దారుణ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వారం క్రితం పట్టపగలే జ్యువెల్లరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరిగింది. ఆ ఘటన మరవకముందే ఆగస్టు 18న కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అంతకుముందు శాలివాహన నగర్‌లో వాకింగ్‌కు వెళ్లిన CPI నేతను కాల్చిచంపగా, అదే రోజు మెదక్ జిల్లాలో మరో రాజకీయ నేతను కూడా హత్య చేశారు. ఇటువంటి వరుస సంఘటనలతో ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. శాంతిభద్రతలు క్షీణించాయంటూ పలు పత్రిక కటింగ్‌లను షేర్ చేస్తూ, వరుస సంఘటనలతో ప్రజల్లో భయం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడిందని, సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. “ప్రజలకు కావాల్సింది భయం కాదు.. భద్రత” అని కేటీఆర్ ఎక్స్‌లో స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం కూడా శాంతిభద్రతల క్షీణతకు కారణమని పలువురు భావిస్తున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

Leave a Reply