అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేపుతోంది. ఈ ఆడియో కాల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తోంది. తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ల మధ్య జరిగిన ఈ సంభాషణలో ‘వార్ 2’ సినిమా అనుమతులపై చర్చ జరిగింది.
సినిమాకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, “నేను అనంతపురం ఎమ్మెల్యేను.. సినిమా ఆడదు, ఆడనివ్వను” అని దగ్గుబాటి హెచ్చరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మంత్రి లోకేష్‌పై ఎలా మాట్లాడతాడని ప్రశ్నిస్తూ, “లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా? వెంటనే థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులను పంపించండి” అని ఆదేశించినట్లు కూడా ఆ ఆడియోలో ఉంది.
JrNTR ని తిట్టిన TDP ఎమ్మెల్యే అంటూ వైరల్ అవుతున్న ఆడియో…
"ఈ ఆడియో యొక్క నిజనిజాలను మేము ధృవీకరించలేదు. మీరే స్వయంగా పరిశీలించుకోవాలి."#JrNTR #DaggupatiVenkateswaraPrasad #Anantapur #War2 #TDP #AudioLeak #KhyathiConnects pic.twitter.com/zslivLA7ZK
— Khyathi Connects (@KhyathiConnects) August 17, 2025
ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందన
వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఇష్టంగా చూస్తానని అన్నారు. ఆడియోలో వినిపిస్తున్న మాటలు తనవి కాదని, ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమని స్పష్టం చేశారు.
నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని
బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని
కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు
ఆ ఆడియో కాల్స్ నావి కాదు… రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు – ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్#JrNTR… pic.twitter.com/AjsAiXZkhv
— oneindiatelugu (@oneindiatelugu) August 17, 2025
ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన ఆయన, “నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడినే. ఈ ఆడియో వల్ల జూనియర్ అభిమానులు మనసు నొచ్చుకున్నట్లయితే నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను” అని పేర్కొన్నారు.