వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వాటిని వెంటనే విడుదల చేయాలి

వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఇచ్చిన తీర్పులో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన కోర్టు, ఇప్పుడు ఆ ఆదేశాన్ని సవరించింది. షెల్టర్ హోమ్‌లకు పంపిన కుక్కలను తిరిగి విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, రేబిస్‌ (Rabies) ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలి. మిగిలిన కుక్కలను స్టెరిలైజేషన్ తర్వాత తిరిగి వదులుతామని పేర్కొంది. అంతేకాక, మున్సిపల్ వార్డుల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల నియంత్రణ కోసం పనిచేసే ప్రభుత్వ అధికారులను ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జంతు ప్రేమికులు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలనుకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలిపింది.

ఇక ఆగస్టు 11న ఢిల్లీలో కుక్క కాట్ల ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఎనిమిది వారాల్లోగా Delhi-NCR వీధుల నుండి అన్ని కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వాటిని తిరిగి వదలకూడదని, వీధుల్లో వాటికి ఆహారం పెట్టకూడదని కూడా స్పష్టం చేసింది.

ఈ తీర్పు జంతు ప్రేమికులు, సంక్షేమ సంస్థల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఇది అమానవీయమైన చర్య అని, జంతువులకు కూడా జీవించే హక్కు ఉందని వారు వాదించారు. దీంతో ఆగస్టు 14న జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని కొత్త ధర్మాసనం ఆ విషయాన్ని విచారించి, ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ వచ్చిన పిటిషన్‌పై తన తీర్పును రిజర్వ్ చేసింది.

Leave a Reply