SRH vs HCA: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై..? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య టికెట్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలోనే ఈ వివాదం మరింత ముదిరింది. SRH యాజమాన్యం హెచ్‌సీఏ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ సమస్య పరిష్కారం కాకుంటే హైదరాబాద్‌ను వదిలివెళ్లే అవకాశముందని హెచ్చరించడం సంచలనంగా మారింది.

ఈ వివాదానికి మూలకారణం ఉచిత టికెట్లు కోరటం అని తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా హెచ్‌సీఏ యాజమాన్యం SRH యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతుందని, ఉచిత పాస్‌లు కేటాయించడంలో సమస్యలు సృష్టిస్తోందని SRH ఆరోపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు SRH యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని, బెదిరింపులు కూడా కొనసాగుతున్నాయని SRH జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ లేఖ ద్వారా వెల్లడించారు.

ఇప్పటి వరకు SRH ప్రతి సీజన్‌కు హెచ్‌సీఏకి 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) కేటాయిస్తోందని, అయితే తాజా వివాదంలో హెచ్‌సీఏ మరిన్ని టికెట్లు డిమాండ్ చేస్తూ SRH సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. గత రెండు సీజన్లుగా ఈ వివాదం తీవ్రమవుతుండటంతో SRH యాజమాన్యం తీవ్ర అసంతృప్తికి గురైంది.

ఈ విషయంపై SRH యాజమాన్యం తీవ్రస్థాయిలో స్పందించింది. HCA ప్రవర్తన చూస్తుంటే, హైదరాబాద్‌లో SRH ఆడేలా చేయకూడదనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ వివాదం పరిష్కారం కాకపోతే BCCI, తెలంగాణ ప్రభుత్వం, తమ యాజమాన్యంతో చర్చించి హైదరాబాద్‌ను వదిలి కొత్త వేదికను చూసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. గత 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో SRH సిబ్బందికి ఎదురవుతున్న వేధింపులు తట్టుకోవడం కష్టంగా మారిందని SRH జనరల్ మేనేజర్ తెలిపారు.

ఈ వివాదంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీ SRH హైదరాబాద్‌ను వదిలివెళితే, ఇది నగరంలోని క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. SRH యాజమాన్యానికి హెచ్‌సీఏ బెదిరింపులు ఇస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. మ్యాచ్‌ల నిర్వహణలో ఎవరైనా SRH యాజమాన్యానికి సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందనేది చూడాలి. SRH అభిమానులు మాత్రం తమ జట్టు హైదరాబాద్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. SRH యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply