ఫోన్ తీసుకున్నారని లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని..!

ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. గురువుకు గౌరవం తగ్గిపోయిందా? అన్న చర్చకు నాంది పలుకుతోంది. ఒకప్పుడు గురువు మాట అంటే శిరసు వంచే రోజులు.. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. తాజాగా విశాఖపట్నం సమీపంలోని రఘు కళాశాలలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.

మొబైల్ ఫోన్ తీసుకున్నాడని లెక్చరర్‌పై దాడి

ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, కళాశాల నిబంధనలను ఉల్లంఘించి క్లాస్ సమయంలో సెల్ ఫోన్ వాడింది. ఇది గమనించిన లెక్చరర్ ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే ఆమెకు నచ్చలేదు. కోపంతో తన చెప్పును తీయడంతో పాటు క్లాస్‌మేట్‌ల ముందే లెక్చరర్‌పై దాడికి దిగింది. ఆమె దూకుడైన ప్రవర్తనతో అక్కడే ఉన్న విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వైరల్ అవుతున్న వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిని ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇలాంటివి చూస్తే, నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది” అని కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఘటన రఘు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్‌ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. వీడియోలో విద్యార్థిని ఫ్యాకల్టీ సభ్యురాలిని దుర్భాషలాడడమే కాకుండా చెప్పుతో కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించినా ఆమె ఆగలేదు.

ఇలాంటివి చూస్తుంటే విద్యార్థుల వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గౌరవం కోల్పోతున్న గురువులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలేజీ యాజమాన్యం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply