కాళేశ్వరం రిపోర్టుపై స్మితా సబర్వాల్ హైకోర్టుకు.. సంచలన పిటిషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు విషయంపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టులో తన పేరు పొందుపరిచినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని తొలగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు తనకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలపై రేవంత్ సర్కార్‌ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ దర్యాప్తు జరిపి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో కూడా సీఎం ఆ నివేదికను ప్రస్తావించారు. ఆ రిపోర్టులో స్మితా సబర్వాల్‌ కాళేశ్వరం నిర్మాణాలకు సంబంధించి రివ్యూ చేసినట్టు పేర్కొనబడింది. ఆమె మూడు బ్యారేజీలను సందర్శించిన ఫొటోలు కూడా రిపోర్టులో పొందుపరచబడ్డాయి.

సీఎం ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారని, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్లు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించారని కమిషన్ స్పష్టం చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. అయితే దీనిపై తనకు 8b, 8c నోటీసులు ఇవ్వకుండా రిపోర్టులో పేరు చేర్చారని స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Leave a Reply