Sivaji: పోసాని గతం నుంచి పాఠం నేర్చుకున్నాడు.. ఇక వదిలేయండి: శివాజీ

రాజకీయాలు.. సినిమాలు ఇంచుమించు కలసిమెలసి ఉన్నట్టుగా కనిపించినా, రెండింటికీ చాలా తేడా ఉంది. రాజకీయ నాయకుల అవసరానికి సినిమా స్టార్లు ఎన్నికల్లో ప్రచారం చేయడం, గెలిచిన పార్టీ ప్రముఖులను కలసి అభినందనలు చెప్పడం పరిపాటి. కానీ, రాజకీయ నాయకుడిలా వ్యవహరించి, తర్వాత నాలిక కరుచుకుని “నేను ఇక రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నా” అంటూ రాగాలు తీసి కామెడీ చేసినా, అది నడవదు అనే విషయం పోసాని ఘనత ద్వారా తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు పోసానికి జరిగినది చాలని, ఇక వదిలేయాలని నటుడు శివాజీ అన్నారు.

వైసీపీ నాయకుడు, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళిపై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన కుటుంబంపై పోసాని తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో అది ఆయన రాజకీయమైనా, ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఆయనపై నమోదైన కేసులు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పోలీసులు దూషణల కేసుల కింద పోసానిని అరెస్టు చేయడం గమనార్హం.

ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో అరెస్టవ్వడం, వెంటనే మళ్లీ జైలుకు వెళ్లడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నెల 26 వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు. ఈ విషయాన్ని సినీ నటుడు, రాజకీయ విశ్లేషకుడు శివాజీ ప్రస్తావించారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం కామనే అయినా, రాజకీయాల్లో లేని నటులు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాను కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, కేసులు పెట్టించుకునే స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

నటుడు శివాజీ మాట్లాడుతూ, “నాకు తెలిసి పోసాని తన వ్యక్తిగత జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ అనుభవించి ఉండరు. ఆయన ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఏపీ ప్రభుత్వం కూడా ఇక ఆయనను వదిలేయాలి. జరిగినదానికి ఆయన చాలా చింతిస్తున్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కాబట్టి, ఆయన రియలైజ్ అయ్యేందుకు ప్రభుత్వమే ఒక అవకాశం కల్పించాలి” అని వ్యాఖ్యానించారు.

శివాజీకి.. పోసాని సహ నటుడు, రచయిత కాబట్టి కొంత అభిమానం ఉండొచ్చు. కానీ, ఇది అందరికీ గుణపాఠం కావాలని, విమర్శలు సద్విమర్శలుగా ఉండాలని, నోరు జారితే చివరకు పోసాని పరిస్థితి రావొచ్చని ఆయన అన్నారు.

Leave a Reply