టీవీ నటి శిల్పా చక్రవర్తి భూవివాదంలో, పోలీసుల జోక్యం నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసు కోర్టులో నడుస్తుండగా, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలో శిల్పా చక్రవర్తి దంపతులు కొనుగోలు చేసిన 32 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా కోర్టులో వివాదం నడుస్తోంది. కేసు విచారణలో ఉండగానే కోర్టు భూమి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవొద్దని స్పష్టం చేస్తూ ఇంజక్షన్ ఆర్డర్ను జారీ చేసింది.
అయితే స్థానిక చింతపల్లి ఎస్సై రామ్మూర్తి, భూమిని అమ్మిన వ్యక్తితో కుమ్మక్కై వివాదాన్ని సెటిల్ చేయమంటూ శిల్పా చక్రవర్తి దంపతులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో శిల్పా చక్రవర్తి, ఆమె భర్త కల్యాణ్ యాకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను జస్టిస్ టి. వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. విచారణలో, 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ నుంచి భూమిని కొనుగోలు చేశామని, అప్పట్లోనే సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్‌తో పాటు పోలీసు రక్షణ కూడా పొందిన విషయాన్ని పిటీషనర్ల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వాదోపవాదనలు విన్న హైకోర్టు, చింతపల్లి ఎస్సై రామ్మూర్తికి వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకున్నారన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాక, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ను పోలీసు శాఖ కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాలు కూడా జారీ చేశాయి.
ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. చివరిగా, సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకుంటే ఉపేక్షించబోమని హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది.