ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రోజు కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి వెళ్లిన రాజారెడ్డి, బయలుదేరే ముందు అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపై రాజారెడ్డి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.
అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన రాజారెడ్డి, ఇటీవల అట్లూరి ప్రియను వివాహం చేసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మకు రాజారెడ్డి అంటే ప్రత్యేక ఇష్టం ఉండేదని చెబుతుంటారు. జగన్-షర్మిల మధ్య విభేదాలు పెరిగిన సమయంలో కూడా విజయమ్మ అమెరికాకు వెళ్లి మనవడి వద్దే విశ్రాంతి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి తన కుమార్తె కొడుక్కి “రాజారెడ్డి” అనే పేరే పెట్టాలని కోరుకున్నారని చెబుతారు.
వైఎస్ షర్మిలా కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇవాళ ఆయన తన తల్లితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌కి వెళ్లారు. ఇంట్లో అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని తల్లితో కలిసి బయలుదేరాడు. త్వరలోనే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం… pic.twitter.com/E8yttonzNW
— Kaza RajKumar (@KazaRajKumar) September 8, 2025
తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కొంతకాలంగా ఆలోచిస్తున్న షర్మిల, చివరకు ఆయనను రంగంలోకి దించారని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తే, ఆయనకు మంచి రాజకీయ అనుభవం వస్తుందని షర్మిల భావిస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజారెడ్డి బరిలోకి దిగే అవకాశముంది. ఇది జగన్‌కు సవాల్‌గా మారే పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో వైఎస్సార్టీపీని ప్రారంభించిన షర్మిల, ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. కడపలో జగన్‌కు సవాల్‌గా బరిలోకి దిగినా, గెలవలేకపోయారు. అయితే ఆ ఎన్నికల్లో షర్మిల, విజయమ్మ కలిసి ప్రచారం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.