Renu Desai: నా పిల్లల భవిష్యత్తు కోసం.. HCU భూమిని కాపాడండి! రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో

తెలంగాణలో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. 400 ఎకరాల అటవీ భూమిని తొలగించి అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించగా, తాజాగా నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ కూడా స్పందించారు.

ఆమె తన భావోద్వేగంతో కూడిన వీడియో ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. “నేను రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలతో పాటు వేలాది మంది పిల్లలకు భవిష్యత్తు ఉంది. వాళ్లకు మంచి నీరు, ఆక్సిజన్ అత్యవసరం. అభివృద్ధి అవసరమే, కానీ ప్రతిచోటా ప్రకృతిని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా భూములు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి చేయండి. ఈ 400 ఎకరాల అటవీ భూమిని వదిలేయండి. ప్లీజ్ మరోసారి ఆలోచించండి” అంటూ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల అటవీ భూమిలో అరుదైన చెట్లు, వైవిధ్యమైన జీవజాలం, పక్షులు, ఇతర జంతువులు ఉన్నాయి. ఈ భూమిని అభివృద్ధి పేరిట తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, పర్యావరణ పరిరక్షకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. HCU క్యాంపస్‌లో నిరసనలు జరుగుతుండగా, సోషల్ మీడియాలో కూడా ‘#SaveHCUForest’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ అంశంపై ఇప్పటికే పలు సినీ ప్రముఖులు మద్దతు తెలుపగా, రేణు దేశాయ్ భావోద్వేగ వీడియో మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె “ఇది కేవలం ఒక యూనివర్సిటీ భూమి సమస్య కాదు, ఇది మన భవిష్యత్ తరాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రస్తుత తరం చేసిన తప్పులు భవిష్యత్ తరం ఊహించలేనంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు.

రేణు దేశాయ్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “ప్రకృతిని నాశనం చేయకుండా అభివృద్ధి సాధించాలనే విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలి”, “HCU అడవి తెలంగాణకు ఊపిరిలాంటిది, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” వంటి వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటివరకు ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఉద్యమం రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచిస్తుందా? HCU విద్యార్థుల పోరాటం ఎలాంటి మార్పులకు దారితీస్తుందా? అనేదానిపై అందరి దృష్టి నెలకొంది.

ప్రకృతి మన కోసం కాదు.. మనం ప్రకృతి కోసం! ఈ 400 ఎకరాలను కాపాడటం అవసరమేనా?

Leave a Reply