రేవంత్ సర్కార్ బంపర్ కానుక.. ఒక్కో మహిళకు రూ.1600 విలువైన రెండేసి చీరలు!

బతుకమ్మ పండుగ (Bathukamma Festival) ముందు మహిళలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద “అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక” పేరుతో చేనేత చీరల పంపిణీ జరగనుంది.

గతంలో ఒక్కో మహిళకు ఒకే చీర ఇచ్చినా, ఈసారి మాత్రం ప్రతి మహిళకు రెండేసి చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి సాధారణ చీరలు కాదు, ఒక్కోటి రూ.800 విలువ కలిగిన చీరలు. అంటే ఒక్కో మహిళకు రూ.1,600 విలువైన రెండు చీరలు అందనున్నాయి.

బతుకమ్మ పండుగ ఈ నెల 21న ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సెప్టెంబర్ 15 లోపే పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ చీరలను చేనేత సహకార సంఘాల ద్వారా తయారు చేయించడంతో చేనేత కార్మికులకు ఉపాధి లభించడమే కాకుండా రాష్ట్రంలోని హ్యాండ్‌లూమ్ పరిశ్రమకు ఊతం లభిస్తోంది.

మరోవైపు, మహిళలు పండుగలో ఉత్సాహంగా పాల్గొనేలా ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. అధికారులు ఇప్పటికే డీఆర్డీఓ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల్లో సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు.

మొత్తం 4,52,780 మంది మహిళలకు 9,05,560 చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందులో మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 3,39,110 మంది మహిళలకు 6,78,220 చీరలు పంపిణీ చేయనున్నారు.

అయితే ఈ రెండు చీరలు ఒకేసారి ఇస్తారా, లేక దసరా తర్వాత ఇంకోసారి పంపిణీ జరుగుతుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply