కల్వకుంట్ల కాదు కలవకుండా ఫ్యామిలీ.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం తమ ప్రభుత్వానిదేనని మరోమారు స్పష్టం చేశారు.

బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన సీఎం, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే ఫ్యామిలీ” అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎవరినీ కలిసే పరిస్థితి రానీయలేదని విమర్శించారు. బీసీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు, హిందువులు, మైనార్టీలు కలవకూడదనే విధానమే కేసీఆర్ అనుసరిస్తున్నారని ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదిస్తే, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చని సూచించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ కోరుకుంటున్నారని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులు గవర్నర్, రాష్ట్రపతుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించరాదంటూ తెచ్చిన చట్టాలు ఇప్పుడు అడ్డంకిగా మారాయని అన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతుంటే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్‌లు అసహనంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లు గవర్నర్ వద్ద ఆగిపోవడానికి మాజీ సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య ఉన్న సన్నిహిత్యమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ లాబీయింగ్ వల్లే బీసీ రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆగిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Leave a Reply