తెలంగాణలో పేదల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచితంగా అందించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. చాలా మంది లబ్ధిదారులు ఈ ఇళ్లను వాడకుండానే ఖాళీగా వదిలేశారు. దీంతో ఆ ఇళ్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఈ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షలకు పైగా ఖర్చు పెట్టింది. అయినప్పటికీ, కొన్ని ఇళ్లలో ఎవరూ నివసించకపోవడం వల్ల రాష్ట్రంలో ఇళ్లు అవసరమైన వారికి అందే అవకాశం కోల్పోతున్నారు. ప్రభుత్వం ఖర్చు చేసినదానికి ఫలితం లేకపోవడమే కాక, ఖాళీగా ఉన్న ఇళ్లు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. అందుకే వాటిని తిరిగి తీసుకొని వాస్తవంగా అవసరమున్న వారికి కేటాయించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ ఇళ్లు ఎక్కువగా నగర శివార్లలో, గ్రామాల దూర ప్రాంతాల్లో ఉండటంతో లబ్ధిదారులు రోజువారీ జీవనోపాధిని కొనసాగిస్తూ ఆ ఇళ్లలో నివసించడం సాధ్యపడటం లేదు. కరెంట్, నీటి సౌకర్యాలు పూర్తిగా లేకపోవడంతో చాలా మంది ఈ ఇళ్లలో ఉండటానికి ముందుకు రావడం లేదు. సిటీకి దగ్గరగా ఇళ్లు ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు కలెక్టర్ల ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఖాళీగా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 37 శాతం లబ్ధిదారులు ఈ ఇళ్లలో నివసించకపోతున్నారని సమాచారం. వారు ఇళ్లలోకి వెళ్లకపోతే, ఆయా ఇళ్లను రద్దు చేసి వాస్తవికంగా అవసరమున్నవారికి కేటాయించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అవసరమైతే, ఇళ్లను తిరిగి తీసుకున్న వారికే సిటీకి దగ్గరగా కొత్త ఇళ్లు కేటాయించే అవకాశమూ ఉన్నట్లు సమాచారం.