కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్ ఇవ్వబోతోంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని దానిని తిరిగి చెల్లించకపోతే వినియోగదారుల ఫోన్లను లాక్ చేసే నిబంధనను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే మొండి బకాయిలను తగ్గించేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఫోన్ కొనుగోలు చేసిన వారు డబ్బు తిరిగి చెల్లించకపోతే, బ్యాంక్‌కు ఆ ఫోన్‌ను తాత్కాలికంగా లేదా పూర్తిగా లాక్ చేసే హక్కు ఇవ్వనుంది. దీంతో రుణాలను రికవరీ చేసుకునేందుకు బ్యాంకులకు కొత్త మార్గం సిద్ధమవుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ విధానం ప్రకారం లోన్ చెల్లించకపోతే వినియోగదారులు ఫోన్లోని ముఖ్యమైన ఫీచర్లను ఉపయోగించలేరు. ఉదాహరణకు కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడటం, కొన్ని అప్లికేషన్లు ఓపెన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. లోన్ మొత్తం చెల్లించిన తర్వాతే బ్యాంక్ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఈ ప్రక్రియను లోన్ ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొననున్నారు.
మొబైల్ కంపెనీలు, బ్యాంకులు కలిసి ప్రత్యేక సాఫ్ట్వేర్ కంట్రోల్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నాయి. దీని ద్వారా బ్యాంక్ లోన్ స్టేటస్‌ను ట్రాక్ చేసి, డ్యూ డేట్ దాటితే రిమోట్‌గా ఫోన్లోని ఫీచర్లను బ్లాక్ చేస్తుంది.
2024లో హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ చేసిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కొనుగోళ్లలో మూడింట ఒక వంతు చిన్న రుణాలపైనే జరుగుతున్నాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు కూడా ఉన్నాయి. వీటిపై మొండి బకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలను పరిశీలిస్తోంది.