రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు.. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ షాక్!

బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ సినీ నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు ఈడీ నోటీసులు అందాయి. ఈ నెల 23న రానా విచారణకు హాజరుకావాలని, 30న ప్రకాశ్ రాజ్ రావాలని ఆదేశించారు. వచ్చే నెల 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాలని ఈడీ సూచించింది.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇందులో రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలతో పాటు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులు ఉన్నారు. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టనుంది. సినీ ప్రముఖులతో పాటు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా పీఎంఎల్ఏ కింద విచారణ జరగనుంది. ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్‌లు

దగ్గుబాటి రానా: జంగిల్ రమ్మి యాప్

నిధి అగర్వాల్: జీట్‌విన్ యాప్

విజయ్ దేవరకొండ: ఏ23 యాప్

మంచు లక్ష్మి: యోలో 247 యాప్

ఇక ఇప్పటికే రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివాదంపై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం,
“నైపుణ్య ఆధారిత గేమ్‌లకే రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. 2017లో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా, అది అప్పుడే ముగిసింది. చట్టబద్ధంగా అనుమతించిన గేమ్‌లకే రానా తన మద్దతు తెలిపారు. ఇలాంటి ఒప్పందాల ముందు రానా లీగల్ టీమ్ ఆ సంస్థకు సంబంధించిన అన్ని చట్టపరమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉంటేనే ఆ ప్రాజెక్ట్‌ను అంగీకరిస్తాడు” అని స్పష్టం చేశారు.

Leave a Reply