Ramchander Rao: తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రామచందర్ రావు.. అధికారికంగా బాధ్యతల స్వీకారం

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ఇంచార్జిగా ఉన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రామచందర్ రావుకు అధికారిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.

ఈ వేడుకలో బీజేపీ ప్రముఖులు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శోభా కరంద్లాజే మీడియాతో మాట్లాడుతూ, “బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా ఎదిగిందని గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

“రాబోయే మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలపై ప్రశ్నలు, బీజేపీ విజయానికి మార్గదర్శకుడిగా పని చేయాలని సూచించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై నిరాశకు గురవుతున్నారు” అని ఆమె అన్నారు.

శోభా కరంద్లాజే ప్రధాన మంత్రి మోదీపై ప్రశంసలు కురిపించారు. “18 గంటలు పనిచేసే ప్రధాని మోదీ, అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం సంపాదనలతో కాదు, సేవాభావంతో నిండిపోయింది” అని అన్నారు.

తెలంగాణలో కూడా బీజేపీని బలోపేతం చేసి, 2029లో మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. “నలభై ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేస్తున్న రామచందర్ రావుకు ఈ పదవి న్యాయం చేస్తుంది” అని ఆమె ప్రశంసించారు.

నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావుకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply