తెలంగాణ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడే ఈ పథకం ద్వారా SC, ST, BC, మైనార్టీలు, EBC/EWS వర్గాలకు రూ.1 లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ ఆర్థిక సహాయం అందించనున్నారు. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 1తో ముగియాల్సి ఉండగా, దాన్ని తాజాగా ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఏకంగా 7 లక్షల దరఖాస్తులు అందాయి.
ఇక సర్వర్ సమస్యల కారణంగా పలు దరఖాస్తుదారులకు ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ముఖ్యంగా ఆదాయ ధ్రువపత్రాల కోసం యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారికి ఇకపై ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని ప్రకటించింది. ఇది వేల మందికి ఊరట కలిగించే విషయమని చెప్పాలి.
ఈ విషయమై బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు మాట్లాడుతూ – రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేని వారు మాత్రం మీ సేవా కేంద్రాల ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం అప్లికేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, 2016 తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుందని తెలిపారు.
దరఖాస్తుదారులు తమ పత్రాలను సన్నద్ధం చేసుకుని, మండల లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ చాన్స్ ద్వారా లక్షల మంది యువత స్వయం ఉపాధికి మార్గం వేసుకోవచ్చు. ఇంకా అప్లై చేయని వారు వెంటనే అప్లై చేయండి… ఎందుకంటే ఆలస్యం అయితే అవకాశం మిస్సవుతుంది!