Raja Singh: ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా..!

తెలంగాణ బీజేపీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపారు. నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా తన మద్దతుదారులను బెదిరించారని, నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రామచందర్ రావుకు ఇవ్వాలన్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్, ఇది లక్షలాది మంది పార్టీ కార్యకర్తల మనసును గాయపరిచే నిర్ణయమన్నారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించానని స్పష్టం చేశారు.

“తెలంగాణలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఈ సమయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు కలిగిస్తున్నాయి. పోరాడిన వారిని పక్కన పెట్టి, వ్యూహాత్మకంగా పనిచేయాల్సిన సమయంలో వ్యక్తిగత లాభాల కోసం కొందరు నేతలు కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాను మూడు సార్లు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండలేనని, ‘అంతా బాగుంది’ అన్న నటనలో భాగస్వామ్యం కావల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇది తన వ్యక్తిగత స్థాయిలో పదవుల కోసమో, ప్రాధాన్యత కోసమో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

“ఇది నాకోసం కాదు – నా వెనుక ఉన్న వేలాది కార్యకర్తల, వారి బాధను ప్రతిబింబించే చర్య. పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై విమర్శలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఎవరి మాటలకూ ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం బాధాకరం. అందుకే నేను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా” అని రాజాసింగ్ ఎమోషనల్‌గా ప్రకటించారు.

Leave a Reply