టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ లావణ్య మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఇది కోర్టుల్లో నడుస్తున్న వ్యవహారం లా ఉండగా, ఇప్పుడు ఈ విషయాలు ఇంటి వద్ద ఘర్షణ స్థాయికి చేరాయి. తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్ మరియు రాజేశ్వరి కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లడం వివాదాస్పదంగా మారింది.
అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో తాము కొడుకు ఇంట్లోనే ఉండాలని కోరుతూ వారు నేరుగా లావణ్య ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే రాజ్ తరుణ్ పై కేసులు ఉన్న నేపథ్యంలో, లావణ్య వారిని ఇంట్లోకి రానివ్వలేదు. “కోర్టు కేసులు నడుస్తున్న పరిస్థితిలో మీరిలా రావడం సరికాదు. అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకుని రండి” అని స్పష్టం చేసింది.
అయితే లావణ్య చెప్పిన దాని ప్రకారం, విషయాలు అక్కడితో ఆగలేదు. మీడియాతో మాట్లాడుతూ “రాజ్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి నాపై దౌర్జన్యం చేశారు. వస్తువులు విసిరిపారేశారు. నన్ను ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టారు. ఇది నేరంగా పరిగణించాలి” అంటూ భావోద్వేగంగా వెల్లడించింది.
లావణ్య ఉంటున్న ఇంటి ముందు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ధర్నా | ABN Telugu#Lavanya #RajTarun #ABNTelugu pic.twitter.com/klEgpy1Xsw
— ABN Telugu (@abntelugutv) April 17, 2025
అంతేకాదు, ఈ ఇల్లు తాను రాజ్ తరుణ్‌తో కలిసి కొన్నదని, తానే రూ.70 లక్షలు పెట్టానని, మేము కొన్నప్పుడు దీని విలువ 1.5 కోట్లు అని.. ఇప్పుడు దీని విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని చెప్పింది. “ఈ ఇల్లు మనదని చెప్పి ఇప్పుడు నన్ను బలవంతంగా బయటకు పంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు” అంటూ తీవ్ర విమర్శలు చేసింది.
ఇంత జరుగుతున్నా.. రాజ్ తరుణ్ మాత్రం ఇప్పటివరకు ఈ వివాదంపై నోరు విప్పలేదు. కానీ విషయం తెలిసిన ఆర్జే శేఖర్ బాషా అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ “రాజ్ తల్లిదండ్రులకు న్యాయం జరిగేంత వరకు నేనిక్కడే ఉంటాను. వారు నేరపూరితంగా ఏం చేయలేదు” అని అన్నారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ వైపు నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. అయితే ఈ ఘర్షణపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.