Rahul Gandhi : లక్షల ఓట్లు తొలగింపు.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

ఓటు చోరీపై హైడ్రోజన్‌ బాంబ్ పేలుస్తానని ముందే ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంపై (EC) ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూల్చిపారేయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని విమర్శించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై కూడా రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయని, ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, OBCలు వంటి వర్గాలనే ప్రత్యేకంగా గుర్తించి తొలగిస్తున్నారని తెలిపారు.

తన ఆరోపణలకు 100% ఆధారాలు ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నంబర్లను వాడారని, ఆ నంబర్లు ఎవరివో, ఎవరు ఆపరేట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదాహరణగా, “సూర్యకాంత్” పేరుతో కేవలం 12 నిమిషాల్లోనే 14 దరఖాస్తులు వేసారని తెలిపారు. అలాగే “గోదాబాయి” పేరుతో నకిలీ లాగిన్‌ ద్వారా 12 ఓట్లను తొలగించారని ఆరోపించారు.

కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలోనే 6,018 ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని రాహుల్ పేర్కొన్నారు. అంతేకాక, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ఓటర్ల చోరీ జరిగిందని అన్నారు.

ఈ విషయంపై వారంలోపుగా ఓటర్ల తొలగింపు వివరాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ ఈసీని డిమాండ్ చేశారు. వివరాలు ఇవ్వకుండా ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య హంతకులను సమర్థిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

Leave a Reply