AP BJP: ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు.. పీవీఎన్ మాధవ్ బాధ్యతల స్వీకారం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మంగళవారం విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు, ఎంపీలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ అధ్యక్ష ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆయనే పీవీఎన్ మాధవ్ పేరును అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అనంతరం మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ జెండాను అప్పగిస్తూ నూతన అధ్యక్షుడికి బాధ్యతలు బదిలీ చేశారు.

ఈ సందర్భంగా పీసీ మోహన్ మాట్లాడుతూ.. “బీజేపీ అనేది ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే పార్టీ. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ప్రతీ స్థాయిలో నాయకుల ఎంపిక ప్రజాస్వామ్య బద్ధంగానే జరుగుతుంది. కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలకు, పార్టీ క్యాడర్‌కు గౌరవం ఉంది. కానీ కాంగ్రెస్‌లో ఆ విధానాలు కనిపించవు. అక్కడ నాయకుల ఎంపిక వన్‌మ్యాన్ షోగా మారిపోయింది. వారికి నచ్చిన వారే పదవులు పొందుతారు. కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వరు,” అని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో ఏపీ బీజేపీ దిశగా ఎలాంటి మార్పులు, వ్యూహాత్మక ప్రణాళికలు అమలవుతాయో చూడాల్సిందే.

Leave a Reply