మాజీ సీఎం జగన్‌కు షాక్.. పులివెందుల ZPTC సీటు టీడీపీ కైవసం

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ప్రధాన పార్టీల్లోనూ ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 7 గంటలకు కడపలోని ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే వెలువడిన ఫలితం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

సొంత ఇలాఖా పులివెందులలో, టీడీపీ అభ్యర్థి మరియు పులివెందుల అసెంబ్లీ ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,033 ఓట్ల తేడాతో గెలుపొందారు. లతారెడ్డికి 6,716 ఓట్లు లభించగా, హేమంత్ రెడ్డికి 683 ఓట్లు, ఇతరులకు 239 ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీంతో మారెడ్డి లతారెడ్డి పులివెందుల జడ్పీటీసీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాసేపట్లో ఆమెకు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం కావడం చారిత్రాత్మకం. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితం కూడా త్వరలో వెలువడనుంది.

ఈ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ముఖ్య నేతల ముందస్తు అరెస్టులు, పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కౌంటింగ్‌కు వైసీపీ ఏజెంట్లు ఎవరూ హాజరుకాకపోవడం, కౌంటింగ్‌ను బహిష్కరించినట్లు ప్రకటించడం గమనార్హం.

పులివెందులలో 76.44% పోలింగ్, ఒంటిమిట్టలో 84.5% పోలింగ్ నమోదైంది. పది టేబుళ్లతో కౌంటింగ్ నిర్వహించిన ఎన్నికల అధికారులు, పులివెందులలో మొత్తం 7,638 చెల్లుబాటు అయ్యే ఓట్లు, 145 చెల్లని ఓట్లు, అలాగే నోటాకు 11 ఓట్లు నమోదైనట్లు తెలిపారు.

Leave a Reply