ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారించింది. జూలై 30న హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరైన ఆయనను అధికారులు సుమారు 5 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన బ్యాంక్ అకౌంట్స్ ను అధికారులు పూర్తిగా పరిశీలించారని, తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారని తెలిపారు. తనను మళ్లీ విచారణకు పిలవలేదని స్పష్టం చేశారు.
2016లో ఒక్క యాప్‌కు మాత్రమే ప్రమోట్ చేశానని, అందుకు డబ్బులు కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. ఇకపై అలాంటి యాప్‌లకు ప్రచారం చేయబోనని తేల్చిచెప్పారు.
తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభించింది. ప్రకాష్ రాజ్ తో పాటు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితర సినీ ప్రముఖులకు నోటీసులు జారీ అయ్యాయి. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరు కావాల్సి ఉంది.
ఈ యాప్‌ల ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల అక్రమ డబ్బును దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. గూగుల్, మెటా వంటి దిగ్గజాలకు కూడా నోటీసులు ఇచ్చి, తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్‌ల ప్రకటనలపై వివరణ కోరింది.
ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల వేలాది మంది యువకులు ఆర్థికంగా కోలుకోలేని నష్టాల్లో పడ్డారు. లక్షలు పోగొట్టుకుని మానసిక ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సినీ సెలబ్రిటీల ప్రచారాల వల్లే యువత ఈ బెట్టింగ్‌కు ఆకర్షితమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆన్‌లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషిద్ధం. ఈ రూల్స్ ప్రకారం, బెట్టింగ్‌లో పాల్గొనడం వల్ల ఏడాది జైలు, రూ. 5,000 జరిమానా, నిర్వహిస్తే 2 ఏళ్ల జైలు, రూ. 10,000 జరిమానా వరకు శిక్షలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కఠినంగా బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకుంటున్నాయి.