Prajwal Revanna: అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు..!

జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇంట్లో పని చేస్తున్న మహిళపై పలు మార్లు లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. తాజా తీర్పులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై ప్రజ్వల్ హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది.

కోర్టులో తనపై వచ్చిన ఆరోపణలను ప్రజ్వల్ ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తన పాపమని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా ఆయన బిగ్గరగా ఏడుస్తూ, “నన్ను కావాలని టార్గెట్ చేశారు” అంటూ వాదనలు వినిపించారు. తాను బీఈ మెకానికల్ గ్రాడ్యుయేట్ అని, ఎప్పుడూ మెరిట్‌లోనే ఉత్తీర్ణుడయ్యానని చెప్పారు.

ఫిర్యాదు వివరాలు:
కర్ణాటక హసన్ జిల్లాలోని గన్నికాడ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళపై 2021 నుంచి పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి దృశ్యాలను వీడియో తీసి, బయట చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, 2023 మే 31న ప్రజ్వల్‌ను అరెస్ట్ చేశారు. 123 ఆధారాలతో పాటు 2000 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. మొత్తం 23 మంది సాక్ష్యులను విచారించిన అనంతరం కోర్టు 14 నెలల తర్వాత ఆయనను దోషిగా ప్రకటించింది.

3,000 అశ్లీల వీడియోలు.. పెన్‌డ్రైవ్ స్వాధీనం
దర్యాప్తులో ప్రజ్వల్ రేవణ్ణ వద్ద సుమారు 3 వేల అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళలపై లైంగిక దాడి చేసి తానే వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక పెన్‌డ్రైవ్‌ను ఫామ్‌హౌస్‌లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలు 2024 లోక్‌సభ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ప్రజ్వల్ హాసన్ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. దీంతో జేడీఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది.

శిక్ష వివరాలు:
ఈ కేసులో IPC సెక్షన్లు 376(2)(k), 376(2)(n) ప్రకారం కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు వెల్లడైన తర్వాత ప్రజ్వల్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నారు. తక్కువ శిక్ష వేయాలని జడ్జిని వేడుకున్నారు.

Leave a Reply