ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసాని బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ తీర్పును వాయిదా వేసిన కోర్టు, చివరకు నేడు (శుక్రవారం) బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పటికే బెయిల్ వచ్చినా, సీఐడీ పీటీ వారెంట్ కారణంగా పోసాని ఇంకా జైలులోనే కొనసాగుతున్నాడు. గత నెల రోజులుగా నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన, ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
గుంటూరు కోర్టులో బుధవారం పోసాని బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, తీర్పును మార్చి 21కి వాయిదా వేసింది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తరఫున ఆయన న్యాయవాదులు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు రోజుల క్రితం విచారణ జరిపిన కోర్టు, నిర్ణయాన్ని ఈరోజుకి వాయిదా వేసి, చివరకు బెయిల్ మంజూరు చేసింది.
గుంటూరు జైలులో ఉన్న పోసానిని మంగళవారం సీఐడీ కస్టడీలోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. అనంతరం గుంటూరు జిల్లా కోర్టులోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడ విచారణ అనంతరం తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం మరల విచారించిన కోర్టు, పోసాని ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేసింది.
నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు గత నెల 27న అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ నుంచి బుధవారం రాత్రి రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలించి అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమ గోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో పోసానిపై పలు కేసులు నమోదయ్యాయి.