PJR flyover: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్! పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభం.. ప్రయోజనాలేంటో తెలుసా?

హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ నుంచి ఊరట కలిగించే శుభవార్త. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పి. జనార్దన్ రెడ్డి (PJR) ఫ్లైఓవర్ ఈ రోజు అధికారికంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు.

ఈ ఫ్లైఓవర్ ఓ ప్రత్యేకమైన నిర్మాణం. ఇది గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై మూడవ స్థాయిలో నిర్మించబడింది. అంటే ఇది త్రిస్తర ఫ్లైఓవర్‌ గా గుర్తింపు పొందుతోంది. క్రింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, మద్యలో శిల్పా లే అవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్, ఇప్పుడు పైభాగంలో ఫేజ్ 2 ఫ్లైఓవర్.

ప్రయోజనాలు:
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం వలన ఐటీ కారిడార్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్తున్న వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కుదింపుకు ఇది పెద్ద ఊరట.

కొండాపూర్ – హఫీజ్‌పేట్ – ORR మార్గాలకు మెరుగైన కనెక్టివిటీ.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కొండాపూర్‌ వరకు ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లూ లేకుండా నేరుగా చేరవచ్చు.

నిర్మాణ విశేషాలు:
వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద రూ. 182.72 కోట్లు వ్యయంతో నిర్మించారు.

మొత్తం 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, ఆరు లేన్‌లు కలిగిన ఫ్లైఓవర్ ఇది.

ఈ నిర్మాణం దేశంలో అరుదుగా ఉండే త్రిస్తర ఫ్లైఓవర్‌లలో ఒకటి.

ఇది అందుబాటులోకి వస్తే, గచ్చిబౌలి ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యలకు ఊరట లభించే అవకాశం ఉండటంతో, స్థానికులు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply