Pawan Vs Varma: పవన్‌పై నేరుగా ప్రశ్నలు.. వీడియో షేర్ చేసిన వర్మ.. రాజకీయంగా రచ్చ!

పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ తన X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, అక్కడి ప్రజలు కనీస మౌలిక సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నారని వర్మ ఈ వీడియోలో ప్రస్తావించారు. ఈ సమస్యపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ, దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే, ఈ వీడియో కేవలం అధికారుల తీరును విమర్శించేందుకే కాకుండా, పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వర్మ షేర్ చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్‌కి స్పందనగా జనసేన, టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తూ తీవ్రస్థాయిలో వాదనకు దిగారు.

ఇటీవల జనసేన నేతలు, వర్మ మధ్య సంబంధాలు కొంత దూరమయ్యాయి. గత ఎన్నికల్లో పవన్ గెలిచేందుకు వర్మ తన టికెట్‌ను త్యాగం చేసి పనిచేసినప్పటికీ, ఇప్పుడు పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందన్న భావన ఆయన వర్గంలో నెలకొంది. ముఖ్యంగా, వర్మకు పదవి రాకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని, పవన్ కూడా తనకు దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం చర్చనీయాంశమవుతున్న తరుణంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

నాగబాబు మాట్లాడుతూ, పవన్ గెలవడానికి జనసేన కార్యకర్తలు, ప్రజలే కారణమని, కానీ పవన్ విజయానికి తానే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు వర్మ వర్గాన్ని మరింత అసహనానికి గురిచేశాయి.

అయితే, ఈ వివాదంపై వర్మ నేరుగా స్పందించకపోయినా, లోపాయికారి వ్యూహంతో తన ప్రాధాన్యతను కోల్పోకుండా కృషి చేస్తున్నారు. ‘కార్యకర్తే అధినేత’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, నియోజకవర్గంలో తన పట్టు బలపడేలా వ్యూహం రచిస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుంటూ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ తన రాజకీయ భవిష్యత్తును మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

Leave a Reply