Pawan Kalyan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ దాడికి కారణమైన వ్యాఖ్యలపై కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని, అలాంటి భాషను వాడే నేతలపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమైనవని పవన్ మండిపడ్డారు.

“ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో చోటు ఉండవు. మహిళలను అవమానించే నాయకులు ప్రజల ముందే శిక్షను ఎదుర్కొంటారు,” అని పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైసీపీ గత పాలనలోనూ ఇలాంటి భాషను వాడటం వల్లే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారన్న పవన్, ఇప్పుడు అధికారంలో లేని పక్షంలోనూ అదే ధోరణి కొనసాగిస్తే, ప్రజలు మరింతగా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. మహిళా గౌరవాన్ని కాపాడటం జనసేనకు అత్యంత ప్రాధాన్యత అని తెలిపారు.

ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్:
తన ఇంటిపై దాడి జరిగిన ఘటనపై ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“అప్పుడు నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను చంపేసేవారు. నా తల్లిని బెదిరించారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజం కానీ, ఇలాంటి దాడులు క్షమించదగినవి కావు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వేమిరెడ్డి దంపతులపై తనకు అనుమానముందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యలపై తానేం పశ్చాత్తాపపడటం లేదని, తాను చెప్పింది నిజమే అన్న స్థైర్యంతో నిలబడ్డారు.

ఈ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కగా, పార్టీలు పరస్పర ఆరోపణలతో ఎదురుదెబ్బల దాకా వెళ్తున్నాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Leave a Reply