Pawan Kalyan: ప్రమాదంలో గాయపడిన మార్క్‌ కోసం సింగపూర్ వెళ్లిన పవన్‌, చిరంజీవి దంపతులు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసి రాత్రి 11.30కి సింగపూర్‌ బయలుదేరారు. ఆయనతో పాటు అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పొగ వల్ల ఊపిరాడక ఇబ్బందులు తలెత్తడంతో అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.

టమాటో కుకింగ్ స్కూల్‌ అనే విద్యాసంస్థ రివర్ వ్యాలీ రోడ్‌లోని షాప్‌హౌస్‌ భవనంలో పనిచేస్తోంది. ఈ భవనం 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అక్కడున్న పిల్లలు సహా 80 మందిని సురక్షితంగా తరలించినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్‌ వెల్లడించింది. అయితే 19 మంది గాయపడగా, వారిలో 15 మంది చిన్నారులే కావడం విషాదం.

ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించగా, పవన్ కళ్యాణ్‌కి వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి కుమారుడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంతేకాదు, సింగపూర్‌లోని భారత హైకమిషన్ అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన సహాయం అందించాలని విదేశాంగ శాఖను ఆదేశించారు.

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నారు. కొడుకు అక్కడే చదువుకుంటున్నాడు. ఈ ప్రమాద ఘటన వార్త తెలుసుకున్నప్పటికీ, పవన్ తన పర్యటనలో గిరిజనులను కలవాల్సిన నైతిక బాధ్యతను మరిచిపోకుండా, వాగ్దానం నెరవేర్చిన తర్వాతే సింగపూర్ వెళ్లడం విశేషం.

పవన్ కుమారుడి కోలుకునేందుకు జనసేన శ్రేణులు పూజలు చేస్తుండగా, ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సానుభూతి తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడు అందరి ఆశీస్సులతో కోలుకుంటున్నాడని పేర్కొన్నారు.

Leave a Reply