బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థిని అభినందించిన పవన్ కళ్యాణ్.. రూ.లక్ష ఇవ్వటానికి కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతలతో పాటు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్మీడియెట్ విద్యార్థిని తన ఆఫీసుకు పిలిపించి ప్రత్యేకంగా అభినందించడం వార్తల్లో హైలైట్ అయింది.

విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన విద్యార్థి రాజాపు సిద్ధూ, తక్కువ ఖర్చుతో బ్యాటరీపై నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, సిద్ధూను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి, అతని ఆలోచనలకు ప్రోత్సాహంగా రూ.లక్ష నజరానా అందించారు.

సిద్ధూ తయారుచేసిన సైకిల్‌ను స్వయంగా పరీక్షించిన పవన్, 80 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మూడు గంటల ఛార్జింగ్‌తో ఈ ప్రయాణ సామర్థ్యం సాధ్యం కావడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు, సిద్ధూ రూపొందించిన “గ్రాసరీ గురూ” వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ను కూడా పవన్ పరిశీలించి అభినందించారు.

పవన్ తనే సైకిల్ నడిపించి, సిద్ధూను పక్కనే కూర్చోబెట్టి, అతనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “హరిహర వీరమల్లు” సినిమా జులై 24న విడుదల కానుంది. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను జాగర్లమూడి క్రిష్ మరియు జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రెండు సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న సినిమా కావడంతో పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply