Pawan Kalyan: మాతృభాష అమ్మైతే.. హిందీ పెద్దమ్మ.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సామాజిక మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – ప్రపంచం విడిపోయేందుకు కారణాల కోసం వెతుకుతుంటే, మన దేశం మాత్రం ఏకమవడానికి ఒక భాషను వెతుకుతోంది. అదే హిందీగా మారిందని అన్నారు. విభిన్న రాష్ట్రాలకు చెందిన నాయకులు, విప్లవకారులు దేశాన్ని ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఉదాహరణలు ఇచ్చారు. జాతీయ గీతం ఒక బెంగాలీ రచనగా మారింది. పంజాబీ భగత్‌సింగ్ దేశం కోసం పోరాడారు. రాజస్థానుకు చెందిన రాణాప్రతాప్ సౌర్యానికి చిహ్నంగా నిలిచారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మాన్‌గా గుర్తింపు పొందారు. మద్రాసు ప్రెసిడెన్సీలో రూపొందిన జెండా దేశానికి త్రివర్ణ పతాకంగా మారింది.

ప్రతి భాష జీవ భాషేనని, మాతృభాష ఇంట్లో మాట్లాడుకునే భాష అయితే, దేశం మొత్తం చుట్టాలంటే హిందీ వంటి రాజ్యభాష అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ లాంటిదని, మనం హిందీకి కూడా గౌరవం ఇవ్వాలి అని స్పష్టం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ప్రాంతీయ భాషలపై గౌరవం తప్పనిసరి అయినప్పటికీ, దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ కోసం హిందీ కీలకమని చెప్పారు.

పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో – హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధికి అడ్డుపడే చర్య అని పేర్కొన్నారు. ఇతర భాషలను నేర్చుకోవడాన్ని అంగీకరించకపోవడం మన సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని అన్నారు. హిందీ నేర్చుకోవడం వల్ల మన ఉనికికి భంగం కాదు, అది మన సామర్థ్యాన్ని పెంచుతుంది. హిందీని నేర్చుకోవడం ఓడిపోవడం కాదు, కలిసి ముందుకు సాగడమే అని పవన్ అన్నారు.

ఇంగ్లీష్ నేర్చుకున్న కారణంగా మనం ఐటీ రంగంలో పురోగతి సాధించగలిగామని గుర్తు చేశారు. అట్లాగే, దేశంలోని ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాషను నేర్చుకోవడం వల్ల అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యంగా సౌత్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం దాదాపు 31 శాతం సినిమాలు హిందీలో డబ్ అయ్యి విడుదలవుతున్నాయని, వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని పవన్ వివరించారు. వ్యాపారాలు, రాజకీయాలు, విద్యా రంగాల్లో హిందీకి ఉన్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ అంగీకరించాలని సూచించారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ చెప్పినదేమిటంటే – మాతృభాషను ప్రేమించాలి, కానీ దేశమంతా కలిసుండాలంటే హిందీ వంటి భాషల్ని స్వీకరించడంలో వెనుకడుగు వేయకూడదని ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు.

Leave a Reply