Pawan Kalyan: పవన్ క్లారిఫికేషన్: హిందీకి వ్యతిరేకం కాదు, నిర్బంధానికి వ్యతిరేకం!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషపై తన వైఖరిని స్పష్టం చేశారు. తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ హిందీని నిర్బంధంగా అమలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఓ వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు. “హిందీ భాష గొప్పదే, కానీ దానిని బలవంతంగా నేర్పించడాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. హిందీని నేర్చుకోవాలనుకునేవారు నేర్చుకోవచ్చు, కానీ అది కంపల్సరీ కాకూడదు” అంటూ పేర్కొన్నారు.

జనసేన 12వ అవిర్భావ సభలో తమిళనాడులో హిందీపై కొనసాగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి స్పందనగా పవన్ క్లారిటీ ఇచ్చారు.

NEP-2020 (National Education Policy) ప్రకారం హిందీని తప్పనిసరిగా నేర్పించాలనే నిబంధన ఏమీ లేదని పవన్ పేర్కొన్నారు. ఈ పాలసీ ప్రకారం విద్యార్థులు మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాషను నేర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. “హిందీ తప్పనిసరి కాదు. విద్యార్థులు తమకు ఇష్టమైన ఇతర భాషలను కూడా నేర్చుకోవచ్చు” అంటూ వివరించారు.

తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని పవన్ చెప్పారు. “మన దేశంలో భాషా వైవిధ్యం గొప్పది. ప్రతి భాషకు సముచిత గౌరవం ఇవ్వాలి. హిందీని ప్రోత్సహించడం తప్పు కాదు, కానీ ఏ భాషను కూడా నిర్భందంగా పెడితే అది న్యాయం కాదని” మరోసారి స్పష్టం చేశారు.

భాషపై జరుగుతున్న అనవసరమైన రాజకీయాలు తక్షణమే ఆగాలని, విద్యార్థులకు భాషా స్వేచ్ఛ ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply