పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరణంపై పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతుండగా, తాజాగా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ఫుటేజ్‌లో ప్రవీణ్ వరుస ప్రమాదాలకు గురైనట్లు కనిపిస్తోంది. మరోవైపు, ప్రవీణ్ సతీమణి జెస్సికా, సోదరుడు కిరణ్ స్పందిస్తూ తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రవీణ్ మరణంపై సోదరుడు కిరణ్ రియాక్షన్.. దర్యాప్తు వేగంగా జరుగుతోందన్న కిరణ్ పగడాల..#pastorpraveen #brother #emotional #kiranpagadala #RTV pic.twitter.com/QRBn7jFglg
— RTV (@RTVnewsnetwork) April 2, 2025
పాస్టర్ ప్రవీణ్ మరణంపై రాజకీయ, మత కోణంలో వివాదాలు చేయటం ఆపాలని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆయన సతీమణి జెస్సికా మరియు సోదరుడు కిరణ్ మాట్లాడుతూ, ఈ కేసును రాజకీయంగా లేదా మతపరంగా చూడొద్దని, ప్రభుత్వ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. కొన్ని వర్గాలు స్వతంత్రంగా దర్యాప్తు చేయడం, యూట్యూబ్, బ్లాగుల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం, మతపరంగా ఈ ఘటనను వాడుకోవడం తగదని కిరణ్ అన్నారు. ఇలాంటి చర్యలు ప్రవీణ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని చెప్పారు.
జెస్సికా మాట్లాడుతూ, “దయచేసి నా భర్తను గౌరవించండి. ఆయన ఎప్పుడూ మత సామరస్యాన్ని కోరుకున్నవారు. మేము ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకంతో ఉన్నాం. ఈ ఘటనను ఎవరూ వేరే విధంగా వాడుకోవద్దు” అని విజ్ఞప్తి చేశారు. అలాగే, “ప్రవీణ్ ఒక మంచి భర్త, మంచి తండ్రి. ఆయన లేరన్న బాధ నుంచి మేమింకా కోలుకోలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో మీ మద్దతు మా కుటుంబానికి ఎంతో అవసరం” అని క్రైస్తవ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ కేసుపై భార్య జెస్సికా ఫస్ట్ రియాక్షన్ | Pastor Praveen Case | Prime9 News#pastorpraveen #pastorpraveenpagadala #jessicapagadala #latestnews #prime9news pic.twitter.com/4xvlwuu1sW
— Prime9News (@prime9news) April 2, 2025
తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ప్రవీణ్ మరణానికి ముందు వరుస ప్రమాదాలకు గురయ్యారు. కీసర టోల్‌గేట్ వద్ద బుల్లెట్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. చిల్లకల్లు టోల్‌గేట్ సమీపంలో మరోసారి బైక్ అదుపుతప్పి కిందపడినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. ఒక లారీ ట్యాంకర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యారని అధికారులు గుర్తించారు.
ఈ ఫుటేజ్‌లను పోలీసులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. వరుస ప్రమాదాల కారణంగా ప్రవీణ్ మరణం అనుకోని ఘటనగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తి విచారణ తర్వాతే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ మృతిపై అనవసరమైన ఊహాగానాలు, తప్పుడు ప్రచారం నిలిపివేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ప్రభుత్వ దర్యాప్తును విశ్వసించి, మత సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.