Sigachi Incident: పాశమైలారం ఘటనలో మరో విషాదం.. అదృశ్యమైన 8 మంది కూడా మృతి..?

తెలంగాణలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నెలకొల్పింది. రియాక్టర్ పేలుడు వల్ల చెలరేగిన మంటలతో ఇప్పటికే 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇంకా 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇంకా 8 మంది కార్మికులు కనిపించకుండాపోయారు.

ఈరోజు మధ్యాహ్నం వరకు రెస్క్యూ బృందాలు శిథిలాల కింద అటూ ఇటూ పడిన మాంసపు ముద్దలు సేకరించాయి. ఆ అవశేషాలను అదృశ్యమైన కార్మికుల కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ స్పష్టత రాలేదు.

అంతేకాకుండా, రియాక్టర్ పేలిన సమయంలో మంటల తీవ్రత, వారి ఉండే స్థానం చూసిన అధికారులు, వారంతా బూడిదై ఉండవచ్చని తుది అభిప్రాయానికి వచ్చారు. దీంతో రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్‌ మృతి చెందినట్టే భావిస్తున్నారు.

ఈ వార్తను అధికారులే స్వయంగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రమాద స్థలంలో కాపలా కాస్తూ తమ బంధువుల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ సమాచారం వినగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శేషంగా మిగిలిన బూడిదను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు మొత్తం మృతుల సంఖ్య 52కి చేరినట్లే భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన ఘటనగా గుర్తించబడుతోంది.

ప్రస్తుతం రెస్క్యూ చర్యలు ముగియగా, పరిశ్రమను మళ్లీ ప్రారంభించేందుకు కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తాత్కాలికంగా కార్మికులందరినీ తమ స్వస్థలాలకు వెళ్లాలంటూ సూచనలు అందించారు. ప్రమాదంలో బంధువులను కోల్పోయిన కార్మికులు కన్నీటి మధ్య తిరిగిపోతున్నారు.

ఘటనపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) బృందం పరిశ్రమను సందర్శించింది. ప్రమాద స్థలాన్ని ప్రతి అడుగు పరిశీలించి, పునరావృతం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష చేసింది. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ఇతర అధికారులతో పాటు సంబంధిత శాఖల పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply