OYO : ఓయో కంపెనీ పేరు మార్చేసింది.. కొత్త పేరు ‘ప్రిజం’..!

హోటల్ రూమ్స్ బుకింగ్స్, ట్రావెల్ టెక్నాలజీ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఓయో (OYO) తన కార్పొరేట్ సంస్థ పేరును మార్చింది. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓయో త్వరలో ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ఓయో మాతృ సంస్థ ‘ఒరవెల్ స్టేస్’ పేరుతో కొనసాగుతుండగా, ఇప్పుడు దానిని ‘ప్రిజం’ (Prism) గా మార్చినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఈ మార్పు వెనుక ముఖ్య ఉద్దేశ్యం తమ గ్రూప్ కింద ఉన్న అన్ని వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే. ‘ప్రిజం’ పేరు ప్రీమియం హాస్పిటాలిటీ, వెకేషన్ హోమ్స్, వెడ్డింగ్ వేదికలు వంటి విభిన్న వ్యాపారాలకు ఒకే గుర్తింపును ఇస్తుందని ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఓయో బ్రాండ్ పేరు మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. ఇది బడ్జెట్, మిడ్-స్కేల్ ట్రావెల్ సెగ్మెంట్‌లో ప్రధాన గుర్తుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రిజం అనే పేరును ఎంపిక చేసేందుకు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పోటీ నిర్వహించగా, అందులో వచ్చిన 6,000 సూచనలలోంచి ఈ పేరును ఎంచుకున్నట్లు ఓయో వెల్లడించింది. నిపుణుల ప్రకారం, ఐపీఓకి ముందే తీసుకున్న ఈ పేరు మార్పు సంస్థ యొక్క విస్తృత వ్యాపార పోర్ట్‌ఫోలియో, వ్యూహాత్మక లక్ష్యాలను స్పష్టంగా తెలియజేయడానికి దోహదం చేస్తుంది.

ప్రస్తుతం ఓయో ప్రపంచవ్యాప్తంగా 35కు పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది. కొత్త పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌లో తమ గుర్తింపును మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply