తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక చర్యలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బాలకార్మికులను గుర్తించి, రక్షించి, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళల భద్రతా విభాగం డీజీ చారు సిన్హా మీడియాకు అందించిన వివరాల ప్రకారం, జూలై 1 నుంచి 31 వరకూ జరిగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 7,678 మంది చిన్నారులు రక్షించబడ్డారు. వీరిలో 7,149 మంది బాలురు కాగా, 529 మంది బాలికలు ఉన్నారు.
చిన్నారులలో అధిక భాగం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే. ఈ రెండు రాష్ట్రాల నుంచి 3,783 మంది పిల్లలు రక్షించబడ్డారు. అంతేకాదు, నలుగురు చిన్నారులు నేపాల్‌కు చెందినవారిగా గుర్తించారు.
రక్షించిన పిల్లల్లో 6,718 మంది బాలకార్మికులుగా పనిచేస్తుండగా, 357 మంది వీధిబాలలు, 42 మంది భిక్షాటన చేస్తున్నవారు, మరో 559 మంది ఇతర పనులలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ చిన్నారులను బాధితులుగా మార్చిన నిందితులపై మొత్తం 1,713 కేసులు నమోదు చేయగా, ఇప్పటికే 1,718 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విముక్తులైన చిన్నారుల్లో 6,593 మంది తల్లిదండ్రుల వద్దకు తిరిగి చేరగా, మిగిలిన 1,049 మందిని రెస్క్యూ హోమ్స్‌కు తరలించారు. ఈ భారీ ఆపరేషన్‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ వంటి పలు శాఖలు సంయుక్తంగా నిర్వహించాయి.
జగిత్యాల జిల్లాలో కూడా ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా కొనసాగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక మహిళా కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. చైల్డ్‌లైన్ సహకారంతో ఏర్పాటైన బృందాలు 36 మంది బాలకార్మికులను గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరిచినట్లు వివరించారు.
చిన్నారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అధికారులు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు, లేక చిన్నారుల గురించి సమాచారం తెలిసినచో డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పౌరులను కోరారు. బాలల హక్కులకు భంగం కలిగించినవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.