కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. లక్షల మందికి లబ్ధి!

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గాన్ని కేంద్రంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రారంభ దశలో మొత్తం 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 11.30 లక్షల మంది పేదలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

గత ఆరు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 41 లక్షల మందికి ప్రభుత్వం ఇప్పటికే రేషన్ అందించింది. తాజా పంపిణీతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల మొత్తం సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తం 3 కోట్ల 14 లక్షల మందికి రేషన్ కార్డుల ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే, ఈ కొత్త కార్డులు స్మార్ట్ ఫార్మాట్‌లో ఉంటాయా లేక పాత తరహాలోనే ఉంటాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ 14వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, అన్ని జిల్లాల్లో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం పౌరులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అనేక కారణాల వల్ల కొంతమందికి కార్డులు అందకుండా పోయాయి. అయితే ఇప్పటి నుంచి ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Leave a Reply