ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు భారీ కుట్ర.. షాకింగ్ వీడియో బయటకు!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర జరుగుతోందన్న వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ ఐదుగురు రౌడీషీటర్లు మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్, శ్రీకాంత్ సహా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. కోటంరెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. కోటంరెడ్డిని హతమారిస్తే గూడూరు, సూళ్లూరుపేటలో పార్టీ టికెట్ ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే ఈ ప్లాన్ పన్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఐదు రోజుల క్రితమే కోటంరెడ్డి అనుచరులు ఈ విషయం పోలీసులకు తెలిపినా, అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నెల్లూరు రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ఈ వ్యవహారంపై నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని, దానిపై దర్యాప్తు జరుగుతోందని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Leave a Reply