Nara Devansh: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన చంద్రబాబు మనవడు.. ఎందుకో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ మినిష్టర్ నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసాడు. చెస్ ఆటలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను తక్కువ సమయంలో పరిష్కరించి, “Fastest Checkmate Solver” గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్-2025 అవార్డును పొందాడు. ఈ అవార్డుల ప్రదానోత్సవం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో జరిగింది, కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు.

దేవాన్ష్ ఈ రికార్డును గతేడాది జరిగిన చెక్ మేట్ మారథాన్లో సాధించాడు. ఈ మారథాన్‌లో, లాస్లో పోల్గార్ రాసిన ‘5334 Problems and Games’ పుస్తకంలోని 175 క్లిష్టమైన పజిల్స్‌ని దేవాన్ష్ పరిష్కరించాడు. ఈ పజిల్స్ వేగం, ఖచ్చితత్వం మరియు ఆలోచనా నైపుణ్యాలను పరీక్షిస్తాయి. అత్యంత తక్కువ సమయంలో ఇవి పరిష్కరించడం ద్వారా దేవాన్ష్ “Fastest Checkmate Solver” అవార్డును గెలుచుకున్నాడు.

ఈ సందర్భంగా దేవాన్ష్ తండ్రి, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో దేవాన్ష్ ఈ గౌరవం పొందడం చాలా ప్రత్యేకం. చిన్న వయసులోనే అతని అంకితభావం, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో తీసుకునే సరైన నిర్ణయాలు ఈ విజయానికి కారణం. ఒక తండ్రిగా అతడి కష్టాన్ని దగ్గర నుంచి చూశాను. అతడి కృషికి ఈ గుర్తింపు నిజమైన బహుమతి. దేవాన్ష్ సాధించిన ఘనతకు మేమంతా ఎంతో గర్విస్తున్నాము.”

ఇది మాత్రమే కాదు, గతంలోనూ దేవాన్ష్ రెండు ఇతర ప్రపంచ రికార్డులను సాధించాడు. 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసి, అలాగే 9 చెస్ బోర్డులపై 32 పావులను 5 నిమిషాల్లో సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా మరో ఘనత సాధించాడు. ఈ విజయాలు చెస్ రంగంలో దేవాన్ష్ నైపుణ్యాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Leave a Reply