Prajwal Revanna: ఫాంహౌస్‌లో దొరికిన ఆ చీరే సాక్ష్యం.. ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు!

కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన ప్రజ్వల్‌కు ఇది భారీ ఎదురుదెబ్బగా మారింది. ఈ కేసులో తీర్పుకు కీలక ఆధారంగా ఒక చీర కీలకపాత్ర పోషించిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

2023 ఏప్రిల్‌లో ప్రజ్వల్ నివాసంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి తనపై జరిగిన లైంగిక దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పలు సందర్భాల్లో తనపై అత్యాచారం జరిగిందని, వీడియోలు తీసి బెదిరించాడని ఆమె ఆరోపించింది. కానీ, దర్యాప్తు కోసం స్పష్టమైన ఆధారాలు అవసరమైన తరుణంలో ఆమె దాచిపెట్టిన ఓ చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ చీరను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా, దానిపై వీర్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు. ఈ ఫలితాలు, బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బలపరిచాయి. కోర్టు విచారణలో 23 మంది సాక్షులను విచారించిన పోలీసులు వీడియో క్లిప్‌లు, ఫోరెన్సిక్ నివేదికలు, సంబంధిత చీరను కోర్టులో సమర్పించారు.

ఈ భౌతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలంతో కలిసి ప్రజ్వల్ రేవణ్ణపై నేరారోపణలను స్పష్టంగా నిరూపించాయి. దీంతో కోర్టు దోషిగా తేల్చిన తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎఫెక్ట్ చూపించనుంది. ఈ ఘటన, రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చేసిన నేరాలపై న్యాయవ్యవస్థ ఎంత గట్టి చర్యలు తీసుకుంటుందో మరోసారి రుజువు చేసింది.

Leave a Reply