మార్చి 22న మేడ్చల్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై రైల్వే పోలీసులు నిజానిజాలను వెల్లడించారు. అసలు ఘటనలో ఎలాంటి అత్యాచారం లేదని, యువతి రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పడిపోవడంతో తలకు గాయాలయ్యాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి, మేడ్చల్‌లోని ఓ ఉమెన్స్ హాస్టల్‌లో నివాసముంటూ స్విగ్గీలో పనిచేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం మేడ్చల్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్‌ఫోన్ షాపులో మొబైల్ డిస్‌ప్లే మార్చించుకుని, రాత్రి 7:30 ప్రాంతంలో ప్లాట్‌ఫాం నంబర్ 10లోని మేడ్చల్ ఎంఎంటీఎస్ మహిళల బోగీలో ఎక్కింది.
ఆ సమయంలో బోగీలో ఆ యువతితో పాటు మరో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్ స్టేషన్ దగ్గర ఆ ఇద్దరూ దిగిపోవడంతో యువతి ఒంటరిగా బోగీలో ప్రయాణం కొనసాగించింది. గుండ్లపోచంపల్లి స్టేషన్‌కు అర కిలోమీటర్ దూరంలో తను రైలు నుండి కిందపడి కంకర రాళ్లపై పడింది. తలకు బలమైన గాయమవడంతో పాటు చేతి మణికట్టు విరిగిపోయింది. ముఖం, తల, శరీరం నుంచి రక్తం వేదిస్తుండడంతో అక్కడికి వెళ్లిన ప్రయాణికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆమెను రాత్రి 11:30 సమయంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో స్పృహ లేని స్థితిలో ఉండగా న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్స్ లో వైద్యం అందించారు.
హాస్పిటల్‌లో స్పృహ వచ్చిన తర్వాత యువతి, తనపై ఓ 25 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేశాడని పేర్కొంది. అతను చెక్స్ షర్ట్, షార్ట్‌లో ఉన్నాడని వివరించడంతో, రైల్వే ఎస్పీ చందనా దీప్తి నలుగురు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలు 300కి పైగా సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాయి. అయితే ఎలాంటి అనుమానితుడి ఆధారాలు కనిపించకపోవడంతో యువతిని మరలా విచారించగా, నిజం బయటపడింది.
తన తలకు గాయాలయ్యింది నిజమే కానీ, రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడినట్టు తెలిసింది. ఇంట్లో విషయం తెలిస్తే తిడతారనే భయంతోనే అత్యాచార ప్రయత్నం జరిగినట్టు చెప్పినట్టు యువతి అంగీకరించింది. దాంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని, ఈ కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు రైల్వే ఎస్పీ తెలిపారు.