Microsoft : ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ షాక్.. ఇక నుంచి వారానికి 3 రోజులు తప్పనిసరి!

ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి కనీసం మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని కొత్త నిబంధన ప్రకటించింది. ఈ రూల్‌ ఫిబ్రవరి 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో అమల్లోకి రానుంది.

ఇటీవలి కాలంలో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం వారానికి కనీసం రెండు లేదా మూడు రోజులైనా ఆఫీసుకు హాజరుకావాలని రూల్స్ పెట్టాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ కూడా ఇదే దిశగా ముందడుగు వేసింది. ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే పనిచేయడం వల్ల పనితీరు ప్రభావితం అవుతోందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ రూల్ పాటించని ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

సియాటిల్‌లోని ఉద్యోగులు ఈ రూల్‌ను సెప్టెంబర్ 2025 నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. తరువాత అమెరికాలోని ఇతర ఆఫీసుల్లో కూడా దీన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. ఫిబ్రవరి 2026 నాటికి అన్ని అంతర్జాతీయ కార్యాలయాల్లో ఈ నిబంధన అమల్లోకి రానుంది. అయితే ఖాతా నిర్వహణ, కన్సల్టింగ్, ఫీల్డ్‌ మార్కెటింగ్ వంటి కొన్ని విభాగాలకు మాత్రం ఈ రూల్స్ వర్తించవని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

ఇకపోతే ఇటీవల టీసీఎస్‌ (TCS) కూడా వర్క్ ఫ్రం హోమ్‌పై కొత్త మార్పులు చేస్తూ, ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకు హాజరు కావాలని కఠినమైన నిబంధనలు విధించింది.

Leave a Reply