Meesho: మీషోలో జాబ్స్ జాతర.. పండుగ సీజన్‌లో 10 లక్షల కొత్త ఉద్యోగాలు

భారతదేశంలో పండుగ సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో, ఈ-కామర్స్ దిగ్గజం మీషో నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. పండుగల సమయంలో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ దేశవ్యాప్తంగా తన విక్రయదారుల నెట్‌వర్క్ మరియు లాజిస్టిక్స్ విభాగంలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించింది.

ఈ ఉద్యోగాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల (టైర్-3, టైర్-4) ప్రజలకు ఎక్కువ అవకాశాలు లభించాయి. దీంతో ఆ ప్రాంతాల ఆర్థిక పరిస్థితులకు ఊరటనిస్తూ, స్థానిక యువతకు కొత్త అవకాశాలు కల్పించబడ్డాయి.

మీషో ప్రకటించిన వివరాల ప్రకారం, 5.5 లక్షల ఉద్యోగాలు విక్రయదారుల నెట్‌వర్క్ ద్వారా, అలాగే 6.7 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు లాజిస్టిక్స్ విభాగంలో కల్పించబడ్డాయి. ఇవి గత ఏడాది పండుగ సీజన్‌తో పోలిస్తే దాదాపు 90 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి. ప్యాకింగ్, రవాణా, రిటర్న్స్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఈ తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ముఖ్యంగా చిన్న పట్టణాల నుంచే దాదాపు 70 శాతం ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇది చిన్న వ్యాపారాల వృద్ధికి తోడ్పడటమే కాకుండా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరింపజేయడానికి సహాయపడుతోంది.

మీషో సీఎక్స్ఓ సౌరభ్ పాండే మాట్లాడుతూ, “ఈ-కామర్స్ రంగంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించడం మా ప్రధాన లక్ష్యం. భారత వ్యాపారాలు, తయారీదారులు, లాజిస్టిక్స్ భాగస్వాములను ప్రోత్సహిస్తూ, ఈ రంగాన్ని మరింత సులభతరం చేస్తాం” అని తెలిపారు.

పండుగ సీజన్‌లో పెరిగే గిరాకీని సమర్థంగా నిర్వహించేందుకు, వినియోగదారులకు ఉత్పత్తులను సకాలంలో అందించేందుకు ఈ భారీ ఉద్యోగ నియామకాలు మీషోకు మద్దతు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply