Marwadi: తెలంగాణలో ముదురుతున్న కొత్త ఉద్యమం.. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం..!

తెలంగాణలో మరో కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. సోషల్‌మీడియాలో “మార్వాడీ గో బ్యాక్” అనే నినాదం విస్తృతంగా వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగిందనే ఆరోపణలు వస్తుండటంతో, స్థానికులు వారి దుకాణాల్లో వస్తువులు కొనొద్దని పిలుపునిస్తున్నారు. ఈ నెల 18న ఆమన్‌గల్‌లో స్థానిక వ్యాపారులు బంద్‌కు పిలుపునివ్వడం ద్వారా ఈ ఉద్యమం మరింత వేడెక్కింది.

ఈ ఉద్యమానికి కారణం గోరేటి రమేష్ అనే ప్రజానాట్యమండలి మాజీ సభ్యుడు. మార్వాడీల దోపిడీని ఎండగట్టే పాట పాడినందుకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో ప్రజాస్వామ్యవాదులు, ఆయనతో కలిసి పనిచేసినవారు ఈ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో మార్వాడీల వ్యాపార పద్ధతులపై ఆరోపణలు మరింతగా బలపడుతున్నాయి.

స్థానికులు చెబుతున్నదాని ప్రకారం, మార్వాడీలు తమ దుకాణాల్లో స్థానిక కార్మికులను కాకుండా తమవారినే పెట్టుకుంటున్నారని, దీంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. అంతేకాకుండా హోల్‌సేల్ వ్యాపారాల్లో స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేటుకు, మార్వాడీ వ్యాపారులకు తక్కువ రేటుకు వస్తువులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు బంగారం, కిరాణం, స్వీట్స్ వ్యాపారాల్లో మాత్రమే ఉన్న మార్వాడీలు ఇప్పుడు అన్ని రంగాల్లోకి ప్రవేశించి స్థానికుల వ్యాపార అవకాశాలను తగ్గిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు, మార్వాడీలకు మద్దతుగా కొందరు నాయకులు నిలుస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “మార్వాడీ గో బ్యాక్” పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మార్వాడీలు తెలంగాణలో వ్యాపారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించిన ఆయన, వారు రాష్ట్ర సంపద సృష్టించారని, హిందూ సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే రాజాసింగ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply