మహేశ్వరం సమీపంలోని కేసీఆర్ రిసార్ట్లో రాత్రిపూట రేవ్ పార్టీ నిర్వహణ పెద్ద కలకలం రేపింది. సమాచారం అందుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకుని దాడి చేశారు. ఈ ఆపరేషన్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకోగా, మొత్తం 72 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ పార్టీని గుంటూరు జిల్లా ఫెర్టిలైజర్ కంపెనీ యజమానులు మరియు వారి సిబ్బంది నిర్వహించినట్లు తేలింది. పార్టీ కోసం ప్రత్యేకంగా 20 మంది మహిళలను తెప్పించి డాన్సులు చేయించినట్లు అధికారులు తెలిపారు.
ఇలాంటి రేవ్ పార్టీలు మహేశ్వరం ప్రాంతంలో గత కొంతకాలంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కుమారుడు, అనుచరుల మద్దతుతోనే ఈ రిసార్ట్ నిర్వాహకులు ధైర్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
రిసార్ట్ యజమాని చంద్ర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానిగా, తన పేరు “కె.చంద్ర రెడ్డి”లోని అక్షరాలతో “కేసీఆర్ రిసార్ట్” అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసులు సంఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అదుపులో ఉన్నవారిని విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.