జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల ఆయన రెండో భార్యగా చెప్పుకుంటున్న సునీతకు షేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడం కొత్త వివాదానికి దారితీసింది.
ఈ సర్టిఫికెట్‌పై గోపినాథ్ గారి మొదటి భార్య మాలిని దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కుమారుడు తారక్ ప్రద్యుమ్న కూడా అధికారులకు పిర్యాదు చేశారు. వారి వాదన ప్రకారం, మాగంటి గోపినాథ్ మరియు మాలిని దేవి మధ్య వివాహం చట్టబద్ధమైనది, ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు. అలాంటప్పుడు చట్టపరంగా రెండో భార్యగా సునీత పేరుతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడం తప్పని వారు ఆరోపించారు.
మాలిని దేవి ఫిర్యాదు స్వీకరించిన షేరిలింగంపల్లి తహశీల్దార్ విచారణ ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ కేసుపై హియరింగ్ జరగనుంది. విచారణకు మాగంటి గారి తల్లి, మాలిని దేవి హాజరుకానున్నారు.
ఇదే సమయంలో, మాగంటి సునీత ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలుస్తుండటంతో ఈ వివాదం రాజకీయ రంగు కూడా దాల్చింది. మొదటి భార్య కుటుంబం చేసిన అభ్యంతరాలు, అధికారుల విచారణ — ఇవన్నీ ఉపఎన్నికల నడుమ హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇప్పుడు అందరి దృష్టి తహశీల్దార్ విచారణ ఫలితంపై ఉంది. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది త్వరలో స్పష్టమవుతుంది.
